language pack

శ్రీమద్భాగవతము నవమ స్కంధము ( Shrimad_Bhagavatamu_Navama_Scandamu )

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

తత్త్వపూర్ణమును, సాహిత్యపూర్ణమును అగు శ్రీమద్భాగవతము భారతదేశమునకు చెందిన విస్తారమగు వాఙ్మయములో ప్రముఖ స్థానమును అలంకరించియున్నది. భారతదేశపు కాలాతీతజ్ఞానము వేదములలో తెలుపబడినది. సంస్కృతభాషలో లిఖించబడిన అట్టి వేదములు మానవవిజ్ఞానానికి చెందిన అన్ని రంగములతో సంబంధములను కలిగియున్నవి. ఆదిలో శ్రవణవిధానము ద్వారా భద్రపరుపబడిన ఆ వేదములు తొలిసారిగా గ్రంథకర్త అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే గ్రంథస్థము కావించబడినవి. వేదరచనము పిమ్మట శ్రీల వ్యాసదేవుడు తన గురుదేవుని ప్రేరణము చేత వాటి సారమును శ్రీమద్భాగవతముగా రచించినాడు. వేదతరువుకు పండిన ఫలముగా తెలియబడెడి ఈ శ్రీమద్భాగవతము వేదజ్ఞానమునకు పరమపూర్ణమును, ప్రామాణికమును అగు వివరణమై యున్నది. శ్రీమద్భాగవతమును రచించిన పిమ్మట వ్యాసుడు దాని సారమును తన తనయుడైన శుకదేవగోస్వామికి బోధించెను. తదనంతరము శుకదేవగోస్వామి సంపూర్ణ భాగవతమును హస్తినాపురము చెంతనున్న గంగాతటముపై ఋషిసభలో పరీక్షిన్మహారాజునకు వినిపించెను. పరీక్షిన్మహారాజు ప్రపంచ చక్రవర్తి, గొప్ప రాజర్షి అయియుండెను. ఒక వారము రోజులలో మరణము సంభవించుననెడి హెచ్చరికను విని అతడు తన రాజ్యమును త్యజించెను. పిమ్మట అతడు ప్రాయోపవేశము కావించి ఆధ్యాత్మికజ్ఞానమును సంపాదింపగోరి గంగాతటమును చేరెను. అతడు శుకదేవగోస్వామిని అడిగిన గంభీరమగు విచారణచే శ్రీమద్భాగవతము ఆరంభమగుచున్నది. పరీక్షిన్మహారాజు కావించిన విచారణకు ఆత్మతత్త్వము మొదలుకొని విశ్వమూలము వరకు గల సమస్త విషయాలను అన్వయించుచు శుకదేవగోస్వామి ఒసగిన సమాధానము ఋషిసంగము నంతటిని ఏడు దినములు నిర్విరామముగా పరీక్షిన్మహారాజు మరణము వరకు ధ్యానమగ్నులను చేసినది. ఆ రీతిగా శుకదేవగోస్వామి శ్రీమద్భాగవతమును తొలిసారి ప్రవచించినపుడు ఆ సభ యందు ఉపస్థితులైన సూతగోస్వామి తదనంతరము నైమిశారణ్యమున ఋషిసంగమునకు దానిని వివరించెను. జనుల ఆధ్యాత్మిక శ్రేయస్సును గురించి విచారించిన ఆ ఋషులు ఆరంభదశలో నున్న కలియుగ దుష్టప్రభావమునకు ప్రతిక్రియ చేయుటకై దీర్ఘకాల యజ్ఞము నొకదానిని చేయుటకు సంకల్పించియుండిరి. వేదవిజ్ఞానసారమును ప్రవచింపుడని ఋషులు అర్థించగా శుకదేవగోస్వామి పరీక్షిన్మహారాజునకు పలికిన రీతిగా సూతగోస్వామి పదునెనిమిదివేల శ్లోకములను గూడిన శ్రీమద్భాగవతమును వారికి వివరించెను. పరీక్షిన్మహారాజు అడిగిన ప్రశ్నలను, వాటికి శుకదేవగోస్వామి ఒసగిన సమాధానములను సమన్వయపరచుటయే గాక, నైమిశారణ్యమున సమకూడిన ఋషుల పక్షమున శౌనకుడు పలికిన ప్రశ్నలకు కూడ సూతగోస్వామి కొన్నిమార్లు ప్రత్యక్షముగా సమాధానములు ఒసగినట్లు ఈ శ్రీమద్భాగవతగ్రంథ పాఠకుడు గాంచగలడు. కనుక ఈ గ్రంథమున ఒకేమారు రెండు సంభాషణలు మనకు గోచరించుచున్నవి. అందులో ఒకటి గంగాతటమున శుకదేవగోస్వామి పరీక్షిన్మహారాజుల నడుమ జరుగగా, రెండవది శౌనకాది ఋషిసంగము మరియు సూతగోస్వామి నడుమ జరిగియుండెను. శ్రీమద్భాగవతమునకు సంబంధించిన ఈ కొద్దిపాటి అవగాహనతో పాఠకుడు ఒకదానితో నొకటి కలిసియుండు పలు సంవాదములను, సన్నివేశములను సులభముగా అవగతము చేసికొనగలడు. ఈ శ్రీమద్భాగవత వ్యాఖ్యాత దీనిని పంచదార చిలకతో పోల్చిరి. ఎచ్చట రుచి చూసినను పంచదార చిలక రుచిగానే, ఆస్వాదనీయముగానే ఉంటుంది. కనుక ఈ శ్రీమద్భాగవత వ్యాఖ్యానమును రుచి చూచుటకు ఏ సంపుటము నుండైనను పఠనమును ఆరంభింపవచ్చును. అయినను అట్టి ప్రాథమిక రసాస్వాదనము తరువాత శ్రద్ధావంతుడైన పాఠకుడు ప్రథమస్కంధమును చేపట్టి ఒక స్కంధము తరువాత ఒకటిగా సహజమైన క్రమపద్ధతిలో శ్రీమద్భాగవతమును పఠింపవలెనని తెలుపబడినది. ఈ శ్రీమద్భాగవత వ్యాఖ్యానము అంతర్జాతీయ కృష్ణ‌చైతన్యసంఘ సంస్థాపకాచార్యులు, కృష్ణభక్తిపరాయణులు, ప్రపంచమంతటను కృష్ణభక్తిని విస్తృతముగా ప్రచారము చేసినవారు అగు కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులవారి పాండిత్యపూర్ణ, భక్తిపూర్ణ కార్యఫలమై యున్నది. ఆయనకు గల ఉత్కృష్ట‌మైన సంస్కృత పాండిత్యము, వైదిక సంస్కృతి, భావములతో పాటుగా నవీన జీవనవిధానములతో గల సన్నిహిత పరిచయము రెండును కలిపి ఈ అతిముఖ్యమైన గ్రంథము యొక్క దివ్యమైన వ్యాఖ్యానము ప్రపంచజనులందరికి వెల్లడించునట్లుగా చేసినది. భక్తివేదాంత బుక్‌ ట్రస్ట్‌ వారిచే వెలువరించబడిన ఈ పలు సంపుటముల గ్రంథము ఆధునిక మానవుని విజ్ఞాన, సాంస్కృతిక, ఆధ్యాత్మికజీవనములో అత్యంత ప్రముఖస్థానమును అలంకరించగలదు.